Rahul Gandhi: రాహుల్ గాంధీ పిల్లాడు.. ఆయన గురించి ఏం మాట్లాడతాం?: మమతా బెనర్జీ
- బీజేపీ ప్రభుత్వం వంద హిట్లర్లతో సమానం
- మహా కూటమి ఏర్పాటు సాధ్యమే
- ప్రధాని పదవిపై మోజు లేదు
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన కంటే చాలా చిన్నవాడని, అయినా సరే, బీజేపీని గద్దె దింపేందుకు ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఆమె కేంద్రంలోని బీజేపీ వంద హిట్లర్లతో సమానమని ఓ ఇంటర్వ్యూలో అభివర్ణించారు. సోనియా గాంధీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్న మమత.. రాజీవ్ గాంధీ, సోనియాల గురించి అయితే ఏమైనా చెప్పగలనని, కానీ రాహుల్ గాంధీ గురించి ఏమీ చెప్పలేనని అన్నారు. ఆయన తనకు జూనియర్ కావడమే అందుకు కారణమన్నారు.
కొన్ని పార్టీలు కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయన్న విషయంపై మమత మాట్లాడుతూ.. అటువంటి వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి వారు ఆ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని అన్నారు. మహా కూటమి ఏర్పాటు సాధ్యమేనన్న మమత అందిరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలపడం వల్ల ఓట్ల చీలికను నివారించవచ్చన్నారు. తనకైతే ప్రధాని పదవిపై ఆసక్తి లేదన్నారు. తాను చాలా సామాన్యమైన వ్యక్తినని తేల్చి చెప్పారు.