Vizag: టికెట్ రాదనే... వైసీపీ నుంచి జనసేనలోకి వైజాగ్ నేత గిరిధర్!
- కోలా గురువులుకు అవకాశం ఇస్తామన్న విజయసాయిరెడ్డి
- మనస్తాపానికి గురైన గంపల గిరిధర్
- జనసేనలో చేరి పోటీ చేసే ఆలోచన
విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వైకాపా నేత గంపల గిరిధర్, తనకు టికెట్ లభించదన్న మనస్తాపంతో జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం విషయానికి వస్తే తెలుగుదేశం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే, వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి పోటీ పడటం ఖాయంగా తెలుస్తుండగా, కాంగ్రెస్ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ రంగంలోకి దిగుతారని సమాచారం.
ఇక్కడ మత్స్యకారులు మెజారిటీ ఓటర్లు కాగా, ఆ తరువాత ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. వైసీపీ నుంచి కోలా గురువులు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన గురువులుకు మరోసారి అవకాశం ఇవ్వనున్నామని ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేయడంతో గిరిధర్ మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. వైకాపా టికెట్ లభిస్తుందన్న ఆశతో ఇంతకాలం వేచి చూసిన గిరిధర్, ఇప్పుడు నిరుత్సాహానికి గురై జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ పడతారని తెలుస్తోంది. దీంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉంటుందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు.