Hyderabad: సీబీఎస్ కుప్పకూలడంపై నిజాం వారసుల ఆగ్రహం... విచారణకు డిమాండ్!
- హైదరాబాద్ లో చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి
- నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయండి
- డిమాండ్ చేసిన నవాబ్ నజాఫ్ అలీ ఖాన్
దాదాపు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్ (సీబీఎస్) డోమ్ కుప్పకూలడంపై నిజాం వారసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పారిశ్రామిక విప్లవం మొదలైందనడానికి నాందిగా మిగిలిన పురాతన డోమ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలిపోయిందని ఆరోపించిన ఏడో నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్, ఈ విషయంలో జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు.
నగరంలో చారిత్రక, పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, సామాన్యుల సంక్షేమం కోసం కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, పురాతన కట్టడాలను సంరక్షించడానికి కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ కుప్పకూలిన వ్యవహారంలో నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని, చారిత్రక నేపథ్యమున్న కట్టడాల పరిస్థితిపై నివేదిక తయారు చేయించాలని కోరారు. పాతబడ్డాయన్న కారణంతో కొన్ని కట్టడాలను తొలగించాలన్న ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని సూచించారు.