elections: 2019లో రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఏపీకి ప్రత్యేక హోదా: రఘువీరారెడ్డి
- మా పొత్తు ప్రజలతోనే
- హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు
- అధికారంలోకి రాగానే పది రోజుల్లో రైతు రుణాల మాఫీ
- రాష్ట్ర ప్రజలకు రాహుల్‌గాంధీ పలుమర్లు భరోసా ఇచ్చారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారని, ఆ నమ్మకంతోనే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, దీంతో టీడీపీ, వైసీపీలకు భయం పట్టుకుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పది రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. నోట్లరద్దు, జీఎస్టీల కష్టాలు, అణగారిన వర్గాలపై దాడులు జరిగినప్పుడు కూడా టీడీపీ, వైకాపా ప్రశ్నించలేదని, ఒకరు ఇంటిలోపల, మరొకరు ఇంటి బయట బీజేపీకి మద్దతిచ్చారని అన్నారు.
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 69వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అతిథులుగా పాల్గొన్ని కార్యక్రమం ప్రారంభించారు. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. అనంతరం పేద మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. తమ అందరి ప్రియతమ నాయకుడు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి... ఇందిరాగాంధీ అడుగు జాడల్లో నడుస్తూ, రాజీవ్‌గాంధీ అలోచన సరళిని అమలు పరుస్తూ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని తపన పడేవారని అన్నారు. ఆరోగ్యశ్రీ, పేదలకు ఉన్నత విద్య, సాగునీటి ప్రాజెక్టులు వంటి గొప్ప కార్యక్రమాలు చేశారని, అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులే అత్యధికంగా సాయాన్ని పొందారని చెప్పారు.
ఇటీవల సోషల్ మీడియా, కొన్ని పత్రికలు, టీవీల ద్వారా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మీద మళ్లీ ఒక కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికో అనుకూలంగా, ఎవరికో ప్రతికూలంగా, కొమ్ముకాస్తుందని రకరకాలైన కథనాలను ఏపీసీసీ అధ్యక్షుడిగా క్లారిఫై చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాము బలోపేతమయ్యే ప్రయత్నమే చేస్తామని, గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అజెండా గురించే పరితపించామని చెప్పారు, ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు కోసం ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేసిన 5వ రోజు నుంచే మా పోరాటం మొదలైందని, అది అవిశ్రాంతంగా కొనసాగుతుందన్నారు.
2019లో రాహుల్ ప్రధాని కాగానే ఏపీకి ప్రత్యేక హోదా
తాము 2019 ఎన్నికల అజెండాగా తయారు చేశామని రఘువీరారెడ్డి అన్నారు. తమ పోరాటాలు మంచి ఫలితాలను ఇచ్చాయని అన్నారు. రాహుల్‌గాంధీ.. రాష్ట్ర ప్రజలకు పలుసార్లు భరోసా ఇచ్చారన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీకి ప్రత్యేకహోదాపైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాకుండా యూపీఏ భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయన్నారు.