Congress: చాయ్ వాలా ప్రధాని అయ్యాడంటే మా చలవే: కాంగ్రెస్

  • ఏడు దశాబ్దాల పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాము
  • గత నాలుగేళ్లుగా దేశంలో అప్రకటిత కర్ఫ్యూ
  • కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే

ఇండియాలో ఓ చాయ్ వాలా ప్రధాని అయ్యారంటే, అది కాంగ్రెస్ పార్టీ చలవేనని, ఏడు దశాబ్దాల పాటు తమ పార్టీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడంతోనే నరేంద్ర మోదీ ప్రధాని కాగలిగారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ముంబైలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. 43 సంవత్సరాల నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు, గత నాలుగేళ్లుగా దేశంలో కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.

"గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని నరేంద్ర మోదీ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగబట్టే, నేడు ఓ చాయ్ వాలా ప్రధానమంత్రి కాగలిగారు. మేము ప్రజాస్వామ్యాన్ని అంతలా కాపాడాము" అని ఆయన అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలన ప్రారంభమైన తరువాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, రైతులకు కొత్త రుణాలు రావడం లేదని, పలు సంక్షేమ పథకాలు ఆగిపోయాయని విమర్శించిన ఆయన, నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులనూ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News