Karnataka: కుమారస్వామి-యడ్యూరప్ప కోసం పోట్లాడుకుంటున్న మఠాధిపతులు, తాంత్రికులు!
- కుమారస్వామి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందన్న మఠాధిపతి
- ఐదేళ్లూ కొనసాగుతారన్న సుడుగాడు సిద్దరు
- లేదంటే తమ వృత్తిని వదిలేస్తామని సవాలు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కోసం ఆ రాష్ట్రంలోని మఠాధిపతులు, తాంత్రికులు పోట్లాడుకుంటున్నారు. తమ వాదన గొప్పదంటే, తమ వాదనే గొప్పదని మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కర్ణాటకలో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలోని మఠాధిపతులు- సెమీ నొమడిక్ గిరిజనుల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
పురాతన వీరశైవ మఠానికి, సెమీ నొమడిక్ ట్రైబ్ (తంత్ర విద్యలు అభ్యసించే తెగ) ‘సుడుగాడు సిద్ధరు’కు మధ్య మొదలైన ఈ జగడమంతా సీఎం కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కోసమే. యడ్యూరప్ప తిరిగి సీఎం అవుతారన్నది చిక్మగళూరు సమీపం, బలెహొన్నూరులోని రంభపురి మఠాధిపతి జోస్యం. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని ఆయన జోస్యం చెప్పారు.
రంభపురి మఠాధిపతి జోస్యంపై సుడుగాడు సిద్దరు మండిపడ్డారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని, కుమారస్వామి పూర్తికాలం పదవిలో ఉంటారని తెగేసి చెప్పారు. ఆయనను ఈ ప్రపంచంలో ఏ శక్తీ గద్దె దింపలేదని స్పష్టం చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠిస్తారని అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే చెప్పామని ఆయన గుర్తు చేశారు. కుమారస్వామి ఐదేళ్లూ సీఎం పదవిలో కొనసాగకుంటే తమ వృత్తినే వదిలి వెళ్తామని ఆయన సవాలు విసిరారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రంభపురి మఠాధిపతి బీజేపీకి బహిరంగంగానే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.