Chandrababu: 5-10-15 అనే కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నాం!: ప్రపంచ నగరాల సదస్సులో చంద్రబాబు
- భూగర్భ జలాలను పెంచగలిగాం
- ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం
- 5 లక్షల మంది రైతులతో నాచురల్ ఫామింగ్ వైపు పయనిస్తున్నాం
సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా భూగర్భజలాలను పెంచగలిగామని... నదుల అనుసంధానంతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భూగర్భ జలాల పునర్వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ చర్యలతో మెరుగైన ఫలితాలను సాధించామని చెప్పారు. సింగపూర్ లో జరుగుతున్న ప్రపంచ నగరాల సదస్సులో ప్రసంగిస్తూ, ఆయన ఈ మేరకు తెలిపారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను సమర్థమైన పద్ధతుల్లో చేపడుతున్నామని చెప్పారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాధనాల ద్వారా గాలి నాణ్యత, నీటి వనరులు, ఉష్ణోగ్రతల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు.
రాజధాని అమరావతిలో 5-10-15 విధానాన్ని అవలంబిస్తున్నామని... అత్యవసర గమ్యస్థానాలను చేరుకోవడానికి 5 నిమిషాలు, సామాజిక అవసరాలకు 10 నిమిషాలు, కార్యక్షేత్రానికి చేరుకోవడానికి 15 నిమిషాలు అనే కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. 5 లక్షల మంది రైతులతో జీరో బేస్డ్ నాచురల్ ఫామింగ్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు.