Supreme Court: ఇకపై విచారణల లైవ్ స్ట్రీమింగ్... సుప్రీంకోర్టు కీలక రూలింగ్!
- సమ్మతి తెలిపిన కేంద్రం
- న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్న సీజే
- త్వరలోనే ప్రారంభం కానున్న ప్రత్యక్ష ప్రసారాలు
సుప్రీంకోర్టులో జరిగే విచారణల లైవ్ స్ట్రీమింగ్ కు మార్గం సుగమమైంది. ఇంతవరకూ ఈ విషయంలో తన నిర్ణయాన్ని వెల్లడించని కేంద్రం, నేడు సుప్రీంకోర్టుకు సమ్మతి తెలుపగా, సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తూ, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేంద్రం సమ్మతిని గురించి ధర్మాసనం ముందు వెల్లడించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, తొలుత చీఫ్ జస్టిస్ ముందు జరిగే విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని, ఆపై దశలవారీగా మిగతా కోర్టు రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.
వేణుగోపాల్ వాదనలు విన్న తరువాత సీజే దీపక్ మిశ్రా స్పందిస్తూ, తన ముందు జరిగే విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎటువంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. కాగా, గత సంవత్సరం ట్రయల్ కోర్టుల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం జనవరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఓ పిటిషన్ దాఖలు చేస్తూ, విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోరారు. దీనిపై విచారించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించాలని కోరింది.