plant: ఉచితంగా మొక్కలు కావాలంటే జీహెచ్ఎంసీని సంప్రదించండి.. 35 లక్షల మొక్కల పంపిణీ!
- 35 లక్షల మొక్కలలో మీ ఇష్టం వచ్చినవి తీసుకెళ్లే అవకాశం
- గ్రేటర్ పరిధిలో 890 ఖాళీ స్థలాలను గుర్తించిన జీహెచ్‌ఎంసీ
- జీహెచ్‌ఎంసీ తరఫున మరో 5 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం
మీ ఇంట్లో గానీ, మీ ఇంటి ముందుగానీ మీకు నచ్చే చెట్టును నాటుతారా?... అయితే, జీహెచ్ఎంసీ జీవ వైవిధ్య విభాగం అధికారులకు ఫోన్ చేయండి. వారి వద్ద ఉన్న 35 లక్షల మొక్కలలో మీ ఇష్టం వచ్చినవి తీసుకెళ్లి నాటుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న హరితహారం కార్యక్రమంలో ప్రస్తుత 2018-19 సంవత్సరం హైదరాబాద్‌లో 40 లక్షల మొక్కలను నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.
వీటిలో 5 లక్షల మొక్కలను నగరంలో ఖాళీ స్థలాలు, వివిధ సంస్థల కార్యాలయాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో నాటాలని, మిగిలిన 35 లక్షల మొక్కలను నగర వాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. నగరంలో ఎన్ని నర్సరీలు ఉన్నాయి? ఏ నర్సరీలో ఏ రకమైన చెట్లు అందుబాటులో ఉన్నాయి? ఉచితంగా పొందడానికి ఏయే అధికారులను సంప్రదించాలి. వారి మొబైల్ నెంబర్లతో సహా వివరాలను జీహెచ్ఎంసీ వెబ్‌సైట్ http://greenhyderabad.cgg.gov.in లో పొందుపర్చారు.
గ్రేటర్ పరిధిలో 890 ఖాళీ స్థలాలను గుర్తించి ఆ స్థలాల్లో ఐదు లక్షల మొక్కలను నాటాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగర వాసులకు ఉచితంగా పంపిణీ చేసే 35 లక్షల మొక్కల్లో ఆరోమాటిక్, ఔషధ, పూల మొక్కలు, అలంకార, నీడనిచ్చే మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు నగరంలో 32 నర్సరీల్లో పెంచే మొత్తం 60 రకాల మొక్కల వివరాలను కూడా వెబ్ సైట్‌లో ప్రదర్శించారు.
గత రెండేళ్లలో కోటీ 60 లక్షల మొక్కల పంపిణీ..
గ్రేటర్‌లో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో 2016-17, 2017-18 సంవత్సరాల్లో కోటీ 60 లక్షల మొక్కలను జీహెచ్ఎంసీ నాటడంతో పాటు ఉచితంగా పంపిణీ చేసింది. 2016-17 సంవత్సరంలో 84,00,091 మొక్కల్లో 2,15,000 మొక్కలను జీహెచ్ఎంసీ ఖాళీ స్థలాలు, చెరువు గట్టులు, కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో నాటింది. మిగిలిన మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేసింది.
జీహెచ్ఎంసీ నాటిన వాటిలో ఇప్పటికే 91 శాతం బతికే ఉన్నాయి. 2017-18లో 7,00,000 మొక్కలు నాటగా వీటిలో జీహెచ్ఎంసీ నాటిన 3.50 లక్షల మొక్కల్లో 93 శాతం సజీవంగా ఉన్నాయని ప్రభుత్వాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎస్‌ఆర్ కింద ట్రీ గార్డుల సేకరణ
హరితహారంలో నాటే మొక్కల సంరక్షణకు ట్రీగార్డ్‌లను సీఎస్‌ఆర్ కింద సేకరిస్తోంది. ట్రీగార్డులు విక్రయించే కంపెనీల వివరాలను, వాటి రేట్లను, అవి దొరికే షాపుల వివరాలను వెబ్‌సైట్‌లో జీహెచ్ఎంసీ ప్రదర్శించింది. ఇప్పటికే పలు కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు సీఎస్‌ఆర్ కింద ట్రీగార్డ్‌లను జీహెచ్ఎంసీకి అందిస్తున్నారు. వీటిని ప్రధాన మార్గాల్లో నాటే మొక్కలకు సంరక్షణగా ఉపయోగిస్తున్నారు.
మొక్కలు కావాలంటే సంప్రదించే అధికారుల వివరాలు...
1. ఎల్బీనగర్ జి.యుగంధర్ 8374901776
2. చార్మినార్ వి.శ్రీనివాస్ 9182668011
3. ఖైరతాబాద్, కూకట్‌పల్లి డి. నాగిరెడ్డి 9989930550
4. శేరిలింగంపల్లి ఎన్.రాజేంద్రకుమార్ 9963550664
5. సికింద్రాబాద్ వి.రామ్మోహన్ 8978031168