paripoornananda: ఇలాగే నన్ను అడ్డుకుంటే ఆహారం తీసుకోవడం కూడా మానేస్తాను: పరిపూర్ణానంద హెచ్చరిక
- కనీసం నేనొక్కడినే యాత్ర చేసేందుకైనా అనుమతి ఇవ్వాలి
- కచ్చితంగా యాత్ర చేసి తీరతాను
- నాకు సెక్యూరిటీ లేదని పోలీసులు అంటున్నారు
- రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే
హిందూ ధర్మంపై కొందరు చేస్తోన్న కుట్రలకు, వ్యాఖ్యలకు నిరసనగా శ్రీ పీఠం అధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానంద చేయ తలపెట్టిన 'ధర్మాగ్రహ యాత్ర'ను పోలీసులు అడ్డుకుని ఆయనను గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం వరకు హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని తన నివాసం లోపలే ఉన్న ఆయన... అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
కనీసం తాను ఒక్కడినే యాత్ర చేసేందుకైనా పోలీసులు అనుమతి ఇవ్వాలని పరిపూర్ణానంద అన్నారు. తాను కచ్చితంగా యాత్ర చేసి తీరతానని ఉద్ఘాటించారు. ఇంకా తనను ఇలాగే నిర్బంధిస్తూ ఉంటే తాను ఆహారం తీసుకోవడం కూడా మానేస్తానని హెచ్చరించారు. తాను యాత్రను కొనసాగేలా అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులదేనని, తనకు సెక్యూరిటీ లేదని వారు అంటున్నారని, తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా వారిదేనని అన్నారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకపోతే యాత్ర ఎలా చేయాలో తనకు తెలుసని అన్నారు.