Telangana: కేసీఆర్ నిర్ణయం వరకు వేచి చూద్దాం.. అప్పటి వరకు తొందరపడొద్దు: డి.శ్రీనివాస్
- అనుచరులతో హోటల్లో రహస్యంగా భేటీ అయిన డీఎస్
- పదవికి రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
- కాంగ్రెస్‌లో చేరితే పదవి, గుర్తింపు లభిస్తాయన్న నేతలు
టీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధపడిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సోమవారం తన నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నేతలతో ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయ్యారు. టీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకునేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నేతలు కొందరు డీఎస్‌పై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
డీఎస్ విషయంలో అధిష్ఠానం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. తనపై నేతలు చేసిన ఫిర్యాదుపై కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పిలుపులేదని డీఎస్ పేర్కొన్నారు. ఒకవేళ వారి ఫిర్యాదుపై పార్టీ అధిష్ఠానం కనుక చర్యలకు ఉపక్రమిస్తే కాంగ్రెస్‌లో చేరాలని అనుచరులు డీఎస్‌కు సూచించినట్టు సమాచారం.
కాంగ్రెస్ నుంచి తనకు పిలుపు వచ్చిందని డీఎస్ చూచాయగా చెప్పారు. అయితే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండడంతో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సమావేశానికి హాజరైన నాయకులు డీఎస్‌ను కోరినట్టు తెలుస్తోంది. మరికొందరు నాయకుల వాదన మాత్రం మరోలా ఉంది. ఏదో ఒక నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకుంటే నియోజకవర్గంలో ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరితే గుర్తింపుతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్ద పదవే వస్తుందని అభిప్రాయపడుతున్నారు.