KCR: సగం మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెడపై కత్తి... టికెట్లు దక్కడం కష్టమే!

  • క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా రేటింగ్ లు
  • సగం మందిపై నెగటివ్ ఫీడ్ బ్యాక్
  • కొన్ని సీట్లను కాంగ్రెస్ నేతలకు ఇచ్చే ఆలోచనలో కేసీఆర్
  • 'ఆపరేషన్ కాంగ్రెస్' చేపట్టాలన్న వ్యూహం

క్షేత్ర స్థాయి నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, రేటింగ్ లను ఇవ్వగా, వీరిలో సగం మందికి మరోసారి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లభించేది అంతంతమాత్రమేనని తెలుస్తోంది. ప్రభుత్వ స్కీములు, సంక్షేమ పథకాలను తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయడంలో వీరు విఫలమయ్యారని భావిస్తున్న గులాబీ దళపతి, ఇప్పటికే టికెట్ ఇవ్వరాదని భావిస్తున్న వారి జాబితాను తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది.

మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం 82. వాస్తవానికి టీఆర్ఎస్ తరఫున 63 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో విజయం సాధించగా, ఆపై మరో 19 మంది ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. తెలంగాణ అసెంబ్లీ వెబ్ సైట్ వివరాల మేరకు టీఆర్ఎస్ 82, కాంగ్రెస్ కు 17, ఎంఐఎంకు7, బీజేపీకి 5, టీడీపీకి 3, సీపీఎంకు 1 ఎమ్మెల్యేలుండగా, మరో ఎమ్మెల్యే స్వతంత్రుడిగా, రెండు నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయి.

టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు, 2014లో టీడీపీ నుంచి విజయం సాధించి, ఆపై పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన కొందరి మెడపైనా కత్తి వేలాడుతోంది. వీరికి మరోమారు అవకాశం లభించడం కష్టమేనని సమాచారం. ఇక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో గెలవలేరని భావిస్తున్న వారి స్థానంలో మరో సమర్థవంతుడైన నేతను వెతికే పనిని తన దగ్గరి సన్నిహితులకు కేసీఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది.

తదుపరి ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేయాలని భావిస్తున్న కేసీఆర్, 'ఆపరేషన్ కాంగ్రెస్'లో భాగంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను పార్టీలోకి వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యే కాంగ్రెస్ నేతలకు ఈ సీట్లను 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశమని కొందరు టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

ఇక హైదరాబాద్ నగరానికి వస్తే, నగర పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ చాలా అసంతృప్తితో ఉన్నారట. వీరెవరూ పార్టీ అంచనా వేస్తున్నట్టుగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారన్న నిర్ణయానికి వచ్చిన కేసీఆర్, వీరి స్థానాల్లో మరొకరిని ఎమ్మెల్యేగా బరిలోకి నిలిపే అవకాశాలు ఉన్నాయని, సరైన సమయంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News