Telangana: వెనక్కి తగ్గిన సోమారపు.. రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటన
- మాట వినని సొంత కార్పొరేటర్లు
- రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటన
- రంగంలోకి కేటీఆర్.. మనసు మార్చుకున్న ఆర్టీసీ చైర్మన్
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేసిన టీఆర్ఎస్ నేత, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మనసు మార్చుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనను విరమించుకున్నానని ప్రకటించారు. సోమారపు ప్రకటనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించారు. ఆయనను పిలిపించుకుని మాట్లాడాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆదేశించారు. కేటీఆర్‌తో చర్చల అనంతరం సోమారపు మీడియాతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తానని కేటీఆర్ హామీ ఇవ్వడంతో సత్యనారాయణ మెత్తబడ్డారు. రాజకీయాల్లోంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. సోమారపు ప్రకటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. అస్త్ర సన్యాసం మంచిది కాదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సోమారపు మాట్లాడారు. సొంత కార్పొరేటర్లే మాట వినలేదన్న బాధతోనే తానా ప్రకటన చేసినట్టు చెప్పారు. కేటీఆర్ తన సందేహాలను నివృత్తి చేశారని అన్నారు. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటన చేయగానే అభిమానులు కంట తడి పెట్టుకున్నారని సోమారపు తెలిపారు.