Youtube: ఆ వీడియో తొలగించనందుకు యూట్యూబ్‌కు రూ.9.5 లక్షల జరిమానా!
- ఢిల్లీ డాక్టర్‌ను, ఆయన ఐవీఎఫ్ ప్రాక్టీస్‌ను దెబ్బ తీసేలా వీడియో
- కోర్టుకెక్కిన వైద్యుడు
- ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని యూట్యూబ్
- తాజాగా జరిమానా విధించిన ఢిల్లీ హైకోర్టు
అభ్యంతరకర వీడియోను తొలగించని కారణంగా వీడియో స్ట్రీమింగ్ సైట్ యూట్యూబ్‌కు ఢిల్లీ హైకోర్టు రూ. 9.5 లక్షలు జరిమానా విధించింది. 2015లో ఇందుకు సంబంధించిన కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన వైద్యుడిని టార్గెట్ చేసేలా ఉన్న ఈ వీడియోను తొలగించాలని కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జి జస్టిస్ నాజ్మి వజిరీ తీర్పు చెబుతూ కోర్టు హియరింగ్‌కు రూ.50 వేల చొప్పున గత 64 రోజుల్లో జరిగిన అన్ని హియరింగ్‌లకు చెల్లించాలని ఆదేశించారు. అలాగే, న్యాయవ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేసినందుకు కూడా యూట్యూబ్‌కు జరిమానా విధించారు.
యూట్యూబ్ మొత్తానికి ఆ అభ్యంతరకర వీడియోను తొలగించినప్పటికీ, సాంకేతిక కారణాలు చూపిస్తూ కోర్టు నిర్ణయానికి అనుగుణంగా కొంత సమయం కోరింది. కంటెంట్‌ను తొలగించలేమని, అయితే ఆ వీడియోను మరెవరూ చూడకుండా డిసేబుల్ చేశామని కోర్టుకు తెలిపింది. ఆ వీడియోను తొలగించాలన్న కోర్టు ఆదేశాలను తాము పాటించలేమని, ఎందుకంటే వీడియోలను సర్వర్ నుంచి పూర్తిగా తొలగించగలిగే సాంకేతిక నియంత్రణ తమ వద్ద లేదని వాదించింది. యూట్యూబ్ వాదనను తిరస్కరించిన కోర్టు తాజాగా రూ. 9.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.