Social Media: కాంగ్రెస్, బీజేపీ డిజిటల్ వార్... మోదీకి ఓ అల్లుడు, సోనియాకు కోడలు వచ్చేశారంటూ ప్రచారం!
- సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్న దివ్యా స్పందన, తేజీందర్ పాల్
- రాఖీ సావంత్ వీడియోను పోస్టు చేసిన దివ్య
- యూపీ యువతి ఆరోపణల వీడియోను చూపించిన తేజ్ పాల్
నరేంద్ర మోదీకి అల్లుడు రావడమేంటి? సోనియాగాంధీకి కోడలు దొరకడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిత్యమూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ నేతలు... ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న డిజిటల్ వార్ ఇది. కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్స్ చీఫ్ దివ్యా స్పందన, ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ సింగ్ బగ్గాలు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకుంటూ ట్విట్టర్ లో పెడుతున్న వీడియోలు చూస్తున్న వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ఇంత చౌకబారు విమర్శలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ వీరు ఏం వీడియోలు పెట్టారో తెలుసా? న్యూయార్క్ ట్రిప్ లో ఉన్న రాఖీ సావంత్, తనకు ఓ భర్త దొరికాడంటూ ఓ వీడియోను పోస్టు చేయగా, దాన్ని దివ్యా స్పందన రీ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాఖీ మాట్లాడుతూ, అందరూ తన భర్త ఎవరని అడుగుతున్నారని, ఇదిగో ఇతనే అంటూ ఒకరిని చూపింది. అతనితో కలసి న్యూయార్క్ లో తిరుగుతున్నానని, ఈ వీడియోను ప్రధాని మోదీ సహా అందరూ చూస్తుంటారని చెబుతూ... మోదీని ఉద్దేశించి "ఇదిగోండీ... ఈయనే మీ అల్లుడు" అని వ్యాఖ్యానించింది. ఈ వీడియోను దివ్య 9వ తేదీన తన ట్విట్టర్ లో పెట్టారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.
దీనికి సమాధానంగా స్పందించిన తేజ్ పాల్, సోనియాగాంధీకి ఓ కోడలు దొరికిందని చెబుతూ, అలహాబాద్ కు చెందిన ఓ మహిళ చేసిన ఆరోపణల వీడియోను పోస్టు చేశారు. రాహుల్ గాంధీ తన భర్తని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె, తనను పెళ్లి చేసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని, రోజూ కలలోకి వస్తుంటారని, చేసిన వాగ్దానాలను నిలుపుకోలేదని ఆరోపించింది. ఓబీసీనైన తనను పెళ్లి చేసుకుని దళితులపై ఉన్న ప్రేమను చూపాలని కోరిందా యువతి. వీడియోల సంగతి ఎలా వున్నా, వీరి ట్వీట్ వార్ ఇప్పుడు వైరల్ అవుతోంది.