roja: గడ్కరీ రాకతో చంద్రబాబు వణికిపోతున్నారు: రోజా
- పోలవరాన్ని కేంద్రమే నిర్మించాల్సి ఉంది
- టెండర్ల కోసం రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారు
- కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిపించాలని 2017లో చంద్రబాబు చెప్పారు
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు వణికిపోయారని, ఆయనకు ముచ్చెమటలు పడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉన్నా... టెండర్లను తనకు అప్పగిస్తే ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీలు అవసరం లేదంటూ రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు.
ఇప్పటి వరకు ఏ కేంద్ర మంత్రి వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని... కానీ, గడ్కరీ వస్తున్నారని తెలియగానే కేబినెట్ మీటింగ్ పెట్టారని... గడ్కరీతో పాటు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లవద్దని ఆయనకు మంత్రులు చెప్పినా కూడా, వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని రోజా అన్నారు. గడ్కరీ వెంట వెళ్లాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో పోలవరం టెండర్లలో ఏ మేరకు అవకతవకలు జరిగాయనే విషయం అర్థమవుతోందని చెప్పారు. జమిలీ ఎన్నికలకు వైసీపీ మద్దతు ప్రకటిస్తే... బీజేపీతో కుమ్మక్కయిందంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిపించాలని, అలాగయితే డబ్బు, సమయం వృథా కాదని 2017లో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు.