sri ramayana express: పర్యాటకులకు శుభవార్త.. నవంబర్ లో ప్రారంభం కానున్న ‘శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్’!
- రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాల ద్వారా పర్యటన
- నవంబర్ 14న ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ఎక్స్ ప్రెస్
- రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన
పర్యాటకుల కోసం భారతీయ రైల్వేస్ ఓ ప్రత్యేక రైలును నడపనుంది. మహాకావ్యం రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా టూర్ ప్యాకేజ్ ను రూపొందించింది. నవంబర్ 14న ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ స్టేషన్ నుంచి బయలుదేరనున్న ఈ ఎక్స్ ప్రెస్ కు ‘శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్’ అని పేరు పెట్టినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మొత్తం 16 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 800 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ టూర్ కు వెళ్లాలంటే ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.15,120 వసూలు చేస్తారు. ఇందులోనే భోజనం, వసతి సదుపాయలన్నీ కల్పిస్తారు.
యూపీలోని అయోధ్యలో ఈ రైలు తొలిస్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి నందిగ్రామ్, సీతామర్హి, వారణాసి, ప్రయాగ, శ్రీనగవేర్పూర్, చిత్రకూట్, హంపి, నాసిక్ మీదుగా రామేశ్వరం చేరుతుంది. శ్రీలంక దేశంలోని కొన్ని ప్రాంతాల గురించి కూడా రామాయణంలో ప్రస్తావనకు వస్తుంది. ఈ టూర్ లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబోల దర్శనాన్ని కూడా చేర్చారు. అయితే, ఇందుకు ప్రత్యేక ఛార్జీలను రైల్వే శాఖ వసూలు చేస్తుంది. శ్రీలంకలోని ఆయా ప్రాంతాలను కూడా సందర్శించాలనుకునే పర్యాటకులు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది.