Arvind Kejriwal: ఢిల్లీలో అమానవీయ ఘటన.. పాఠశాలలో బాలికలను బంధించిన యాజమాన్యం!
- ఫీజు చెల్లించని కారణంగా శిక్ష
- 59 మంది బాలికలను బంధించిన వైనం
- రబియా గర్ల్స్ పబ్లిక్ స్కూల్లో ఘటన
- నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేజ్రీవాల్
ఫీజు చెల్లించని కారణంగా ఓ పాఠశాల యాజమాన్యం 59 మంది బాలికలను తమ భవనంలోని బేస్మెంట్లో బంధించిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ బాలికలంతా నర్సరీ విద్యార్థులేనని తెలిసింది.
రబియా గర్ల్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించి, తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై స్పందించిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫరా దిబా మాట్లాడుతూ... ఆ బేస్మెంట్లో చిన్నారులు ఆడుకుంటారని, అక్కడ ఇద్దరు టీచర్లు కూడా ఉండి పిల్లల్ని గమనిస్తూ ఉంటారని చెప్పారు. ఆ బాలికలు సాధారణంగానే అక్కడ కూర్చున్నారని, తమపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అలాగే, ఆ గదిలో కొన్ని రోజులుగా ఫ్యాన్ పనిచేయడం లేదని అన్నారు.
ఆ చిన్నారుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ... తమ పిల్లల్ని ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అక్కడే కూర్చోబెట్టారని, పిల్లల్ని తీసుకురావడానికి అక్కడకు వెళ్లగా తమకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఫీజు కట్టని కారణంగానే పాఠశాల యాజమాన్యం ఇలా వేడి ఎక్కువగా ఉన్న చోట కూర్చోబెట్టి అమానవీయంగా ప్రవర్తించిందని ఆరోపించారు.