india: ఫ్రాన్స్ ను వెనక్కి నెట్టి ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్!
- 2017 ఫిగర్స్ ను విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్
- అగ్ర స్థానంలో అమెరికా... ఐదో స్థానంలో బ్రిటన్
- 2032 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనున్న భారత్
ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. ఈ క్రమంలో ఫ్రాన్స్ ను ఏడో స్థానానికి నెట్టేసింది. ఈ విరాలను ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. 2017 ఫిగర్స్ ప్రకారం, గత ఏడాది చివరి నాటికి... ఇండియా జీడీపీ 2.597 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2017 జూలై తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంది. అయితే, తలసరి ఆదాయం ప్రకారం చూస్తే మాత్రం మన కంటే ఫ్రాన్స్ ఎన్నో రెట్లు ముందుంది. భారత్ జనాభా 130 కోట్లకు పైగా ఉంటే... ఫ్రాన్స్ జనాభా కేవలం 7 కోట్లు మాత్రమే.
గత దశాబ్ద కాలంలో భారత్ జీడీపీ ఏకంగా రెట్టింపు అయింది. రానున్న రోజుల్లో ఆసియాలో కీలకమైన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ ఎదగనుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు తగ్గే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
లండన్ కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసర్చ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు మాట్లాడుతూ... 2018 చివరకల్లా బ్రిటన్, ఫ్రాన్స్ లను భారత్ అధిగమిస్తుందని తెలిపారు. 2032 కల్లా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం 2017 చివరి నాటికి ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా బ్రిటన్ ఉంది. ఈ జాబితాలో అమెరికా అగ్ర స్థానంలో ఉండగా చైనా, జపాన్, జర్మనీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.