swamy paripurnananda: స్వామి పరిపూర్ణానందని బహిష్కరించడంపై గవర్నర్ కు ఫిర్యాదు
- గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు బండారు, కిషన్ రెడ్డి
- పోలీసులు తీసుకున్న చర్యలు సమర్థనీయం కాదు
- పరిపూర్ణానందను బహిష్కరించే హక్కు పోలీసులకు ఎక్కడుంది?
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగరం నుంచి ఆరు నెలల పాటు బహిష్కరిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ని కలిసి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి ఈరోజు రాజ్ భవన్ కు వెళ్లి ఈ మేరకు విచారణ చేపట్టాలని కోరారు.
అనంతరం, మీడియాతో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, స్వామి పరిపూర్ణానందను ఎందుకు గృహనిర్బంధం చేయాల్సి వచ్చిందో, ఆర్నెల్ల పాటు హైదరాబాద్ నగర బహిష్కరణ ఎందుకు విధించారో విచారణ చేపట్టాలని గవర్నర్ ని కోరామని చెప్పారు. గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్నారు కనుక ఆయన్ని కలిశామని, ప్రభుత్వ చర్యలపై విచారణ జరపాలని కోరామని అన్నారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యలు సమర్థనీయం కాదని, స్వామి పరిపూర్ణానందపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తాము నిరసిస్తున్నట్టు చెప్పారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ, స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణ చేసే హక్కు పోలీసులకు ఎక్కడుందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఎవరిపైన అయినా ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నర్ కు ఉందని, అందుకే, ఈ సంఘటనపై ఆయనకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పలు సందర్భాల్లో హిందువుల మనోభావాలు భంగపరిచేలా మజ్లిస్ పార్టీ నేతలు మాట్లాడారని, మరి, వారిపై ప్రభుత్వం, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.