Kathi Mahesh: కత్తి మహేశ్, పరిపూర్ణానంద బహిష్కరణ అందుకేనా?
- శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు
- కేసీఆర్ ఆదేశాల మేరకే నగర బహిష్కరణ
- సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తే కఠిన శిక్ష
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు సిద్ధమైన స్వామి పరిపూర్ణానంద స్వామిని నగరం నుంచి ఎందుకు బహిష్కరించారు? పోలీసులు వారిపై కేసులు పెట్టకుండా నగర బహిష్కరణ మంత్రం ఎందుకు ప్రయోగించారు? ప్రస్తుతం ఈ ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. వారి నగర బహిష్కరణ వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.
రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో మత ఘర్షణలకు ఊతమిచ్చే ఘటనపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. మత సామరస్యాన్ని దెబ్బతీసే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు. మతం పేరిట ఘర్షణలు, రాజకీయాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందులో భాగంగానే వీరిద్దరినీ నగరం నుంచి బహిష్కరించినట్టు తెలుస్తోంది.