Yadadri Bhuvanagiri District: యాదగిరిగుట్టలో కలకలం... అమ్మాయిలను వ్యభిచారంలోకి దించుతున్న నలుగురు మహిళలపై పీడీ యాక్ట్!

  • గుట్ట ప్రాంతంలో దశాబ్దాలుగా వ్యభిచారం
  • ఎందరు మారినా మారని ఆ నలుగురు
  • చంచల్ గూడా జైలుకు నలుగురు మహిళలు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దాలన్న కేసీఆర్ సర్కారు ప్రణాళికలకు, ఇక్కడ దశాబ్దాలుగా వేళ్లూనుకున్న వ్యభిచార దందా అడ్డుగా నిలుస్తున్న వేళ, పోలీసులు ఈ వ్యవహారంపై ఉక్కుపాదం మోపారు. దారితప్పిన కొందరు మహిళలు, తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునే మార్గాలను వెతుక్కునే యువతులకు గాలం వేసి, వారిని వ్యభిచార కూపంలోకి దింపి, యాదగిరిగుట్టలోని లాడ్జీలు, గృహాలు వేదికగా, దందా నడుపుతుండగా, పోలీసులు వారిపై ఇప్పుడు కఠిన చట్టాలను ప్రయోగించారు.

గుట్టలో వ్యభిచారం చేస్తూ గడచిన ఐదేళ్లలో 21 పీటా కేసులు, 250కి పైగా ఇతర కేసులు నమోదైన నలుగురు మహిళలపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. వ్యభిచారం నిర్వహించారన్న ఆరోపణలపై అరెస్ట్ అయి, కోర్టుకు వెళ్లి జరిమానా కట్టి తిరిగి వచ్చి, అదే దందా కొనసాగిస్తున్న సంధ్య, శశిరేఖ, బుచ్చమ్మ, నిర్మల అనే మహిళలపై పీడీ యాక్ట్ పెట్టి, కనీసం సంవత్సరం పాటు జైల్లో ఉంచాలని నిర్ణయించారు పోలీసులు.

ప్రస్తుతం యాదగిరిగుట్టలో 32 కుటుంబాలు వేశ్యా వృత్తిలో ఉన్నాయని గుర్తించిన పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, వారిని మార్చేందుకు కృషి చేసినా, ఈ మహిళలు తిరిగి వారిని అదే దారిలో నడిపిస్తున్నారన్నది పోలీసుల ఆరోపణ. 2016లో గుట్ట ప్రాంతంలో వ్యభిచారులుగా ముద్రపడిన అమ్మాయిలు, నిర్వాహకులుగా కోర్టులకు వెళ్లిన వారిలో చాలామంది మారినా, వీరు మాత్రం మారలేదని, అందుకే పీడీ యాక్ట్ పెట్టాల్సి వచ్చిందని పోలీసులు అధికారులు చెబుతున్నారు.

ఓ యువతిని మాయ మాటలతో లోబరచుకుని, వారికి తొలుత లగ్జరీ లైఫ్ ను రుచి చూపించి, ఆపై దందాలోకి దింపడం వీరికి వెన్నతో పెట్టిన విద్యని, ఆపై వారిని వాడుకుని వేలకు వేలు తీసుకుని, వీరికి మాత్రం వందల్లోనే ఇచ్చి, ఇదే దందాలో కొనసాగేలా చూసి, యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారని, ఎదురు తిరిగితే బెదరింపులకు పాల్పడతారని, అందువల్లే అతి కఠినమైన పీడీ యాక్ట్ ను ప్రయోగించామని పోలీసులు అంటున్నారు. వీరిని చంచల్ గూడా జైలుకు తరలించామని, ఇకపై గుట్టలో అసాంఘిక, అనైతిక కార్యకలాపాలకు తావివ్వబోమని తేల్చి చెబుతున్నారు పోలీసులు.

  • Loading...

More Telugu News