Chandrababu: ఇవ్వడానికి ఇంకేమైనా ఒక్క హామీ చెప్పు: చంద్రబాబుకు కన్నా చాలెంజ్
- కుట్రలు, కుయుక్తులతో విమర్శలు
- ఏ హామీనీ నెరవేర్చని చంద్రబాబు
- కేంద్రంపై ఆరోపణలన్నీ దుష్ప్రచారమే
- నిప్పులు చెరిగిన కన్నా లక్ష్మీనారాయణ
వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో విజయం కోసం చంద్రబాబునాయుడు కుట్రలు, కుయుక్తులు పన్నుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నిప్పులు చెరిగారు. ఆయన మ్యానిఫెస్టోలో గతంలో ప్రకటించిన హామీల్లో దేన్నీ గత నాలుగేళ్లలో నెరవేర్చలేదని, తన వద్ద ఏవైనా కొత్త హామీలుంటే చెప్పాలని సవాల్ విసిరారు. ఈ ఉదయం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కేంద్రం నిధులను ఇస్తున్నప్పటికీ, అవన్నీ రాష్ట్ర నిధులని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగిన ఆయన, సహాయం చేసిన చేతులను నరకడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు.
తమ పార్టీతో పాటు జనసేనతో నాలుగేళ్లు కలిసుండి, ఇప్పుడాయన చేసిన అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తమపై అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఇప్పటివరకూ సరైన సమాచారాన్ని ఇవ్వలేదని వెల్లడించిన ఆయన, కడపలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని, ఆయనే ఒప్పుకుంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చుండేవని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని అన్నారు.
సమయం వచ్చినపుడు విశాఖకు రైల్వే జోన్ వస్తుందని చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ, పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని తమకు సాక్ష్యాలతో సహా తెలిసిందని అన్నారు. ఇక చంద్రబాబు వద్ద ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలేవీ లేవని అన్నారు. అన్ని వర్గాలనూ మోసం చేసిన ఆయన, ఇప్పుడు కేంద్రాన్ని నిందించడమే మ్యానిఫెస్టోగా పెట్టుకున్నారని, అంతకుమించి ఇంకే హామీ అయినా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.