Godavari: వరద ఉద్ధృతి... ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లు ఎత్తివేత!
- 3.30 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి
- సాయంత్రం మరింతగా వరద పెరిగే అవకాశం
- కాలువల నుంచి పూర్తి స్థాయిలో నీటి విడుదల
గోదావరి నదిలో వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ వరద నదిలో వచ్చి చేరుతుండగా, కొద్దిసేపటి క్రితం రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజ్ కి ఉన్న మొత్తం 175 గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. మొత్తం 3.30 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేశారు. నిన్నమొన్నటి వరకూ స్వచ్ఛమైన నీటితో ఉన్న గోదావరి ఇప్పుడు ఎర్రటి వరద నీటితో నిండిపోయింది.
బ్యారేజ్ అన్ని గేట్లనూ ఎత్తివేయడంతో, భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఈ దృశ్యాన్ని వీక్షిస్తున్నారు. విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో ఉండి, ఆపై ఏపీలో చేరిన మండలాల్లో కురిసిన వర్షాలకు శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు, పైనుంచి వస్తున్న నీటితో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 9 అడుగులకు పైగా ఉంది. ఈ సాయంత్రానికి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు, వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నట్టు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రాజెక్టు నుంచి పొలాల్లోకి దారితీసే అన్ని కాలువల్లోకీ పూర్తి స్థాయి నీటిని వదులుతున్నామని తెలిపారు.