Tollywood: రామాయణ మహాభారతాల్లోని మంచి గురించి మాట్లాడుకుందాం: తమ్మారెడ్డి భరద్వాజ
- రామాయణ, భారతాల్లో ప్రతిదీ మంచిగా లేదా చెడుగానే ఉంటుంది
- చెడుని వదిలేద్దాం
- హిందూస్థాన్ లో పుట్టిన వాళ్లందరూ హిందువులే
మహాకావ్యం రామాయణంలోని పాత్రలపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మనుషుల మీద ద్వేషాలు పెంచుకుని, అసహ్యంగా, అసభ్యంగా మనం మాట్లాడుకోవడం సమాజానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
‘రామాయణం ఒక మహాకావ్యం..ఇది నిజం అనుకునేవాళ్లు కొంత మంది. అబద్ధమనేకునేవాళ్లు మరికొంతమంది. ఇది కల్పిత కథ అనుకునేవాళ్లు ఇంకొంతమంది ఉంటారు. ఏదైనా కానివ్వండి.. రామాయణంలో కానీ, భారతంలో గానీ మనం తీసుకుంటే ప్రతిదీ మంచిగానో లేక చెడుగానో ఉంటుంది. అందుకని చెడును వదిలిపెట్టి మంచి గురించి మాట్లాడుకుందాం.
అంతేకానీ, ప్రతిదీ మతానికి ఆపాదించి, మనుషుల మీద ద్వేషాలు పెంచుకుని, అసహ్యంగా, అసభ్యంగా మనం మాట్లాడుకోవడం సమాజానికి మంచిది కాదు. నాకు తెలుసు భారతదేశంలో పుట్టినవాళ్లందరూ హిందువులే. నాన్-హిందూ అనే వాడెవరూ ఉండరు...హిందూస్థాన్ లో పుట్టిన వాళ్లందరూ హిందువులనే లెక్క వస్తుంది. ఇప్పుడు, మన పిల్లలు అమెరికాలో పుడితే అమెరికన్ సిటిజన్స్ అయిపోవట్లా! అలానే, భారతదేశంలో పుట్టిన వాళ్లు భారత పౌరులే..హిందువుల కింద లెక్కే.
మతాలు, కులాలు అనేవి మనకు మనం సృష్టించుకున్నవే...‘వాళ్లు హిందువులు కాదు’ ‘వీళ్లు హిందువులు కాదు’ అనే వ్యాఖ్యలు చేసుకుంటూ, మనలో మనం తిట్టుకుంటూ మానవత్వాన్ని అవమానపరుస్తున్నామని నా భావన. మనల్ని మనం గౌరవించుకుంటే మానవత్వాన్ని గౌరవించినవాళ్లమవుతాం. అలా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరో ఒక మనిషి ఏదో అన్నాడని చెప్పి, దాని మీద పెద్దపెద్దవాళ్లు కూడా అసభ్యపదజాలం ఉపయోగించడం సరైన పద్ధతి కాదు.
చెడిపోయిన వాళ్లను దారిలో పెట్టడానికి మన సమాజం ఉంది గానీ, వాళ్లను తిట్టడానికో, కొట్టడానికో, మర్డర్ చేయడానికో కాదు. ఈ విషయాన్ని వదిలిపెట్టేసి. ద్వేషవిద్వేషాలతో మనం రగిలిపోతున్నాం.. మనలో అసహనం ఎక్కువైపోయింది. ఎవరో ఏదో మాట్లాడితే..మనం సమాధానం చెప్పుకోవాలి, ఎదుటి వాడు తన తప్పు తాను తెలుసుకునేలా చేయగలగాలి. అంతకన్నా, గొప్ప ఏముంది? ప్రతి వాడిని మన అక్కున చేర్చుకునే పద్ధతి కావాలి గానీ, విద్వేషాలు పెంచుకోవడమనేది అనాగరికమవుతుంది’ అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.