KuldeepYadav: కుల్దీప్ తిప్పేశాడు.. కోహ్లీ, రోహిత్ బాదేశారు.. తొలి వన్డే భారత్‌దే!
- మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం
- అన్ని రంగాల్లోనూ రాణించిన భారత్
- ఆరు వికెట్లు తీసిన కుల్దీప్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బంతితో రికార్డులు తిరగరాయగా, రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ బ్యాట్‌తో చెలరేగిపోయారు. ఫలితంగా భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన కోహ్లీ మరో ఆలోచనకు తావులేకుండా ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. క్రీజులోకి వచ్చిన ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడారు. పది ఓవర్ల వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లను మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 73 పరుగుల వద్ద జాసన్ రాయ్ (38)ని బోల్తా కొట్టించాడు.
ఇక అప్పటి నుంచి కుల్దీప్ వికెట్ల వేట ప్రారంభం కాగా, ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. కుల్దీప్ వరుసపెట్టి వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను కుప్పకూల్చాడు. అద్భుతమైన స్పెల్‌తో ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ తర్వాత ఆరు వికెట్లు తీసిన చైనామన్ బౌలర్‌గా కుల్దీప్ రికార్డులకెక్కాడు. కుల్దీప్ దెబ్బకు ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. మరో బంతి మిగిలి ఉండగానే 268 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం 269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అలవోకగా లక్ష్యాన్ని సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోమారు సెంచరీ (137) తో చెలరేగగా, శిఖర్ ధవన్ 40, కోహ్లీ 75 పరుగులు చేశారు. మరో 59 బంతులు మిగిలి ఉండగానే కోహ్లీ సేన రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. రెండో వన్డే ఈ నెల 14న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.