YSRCP: జడివానలోనూ నడక ఆపని జగన్.. గొడుగు తోడుగా కొనసాగిన పాదయాత్ర
- నిన్న రెండున్నర కిలోమీటర్లు మాత్రమే నడిచిన జగన్
- పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు
- నేడు సీబీఐ కోర్టులో హాజరు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం తన పాదయాత్రను జోరు వానలోనే కొనసాగించారు. అయితే, శుక్రవారం ఆయన కోర్టులో హాజరు కావాల్సి ఉండడంతో కేవలం రెండున్నర కిలోమీటర్లతోనే సరిపెట్టుకున్నారు. బుధవారం రాత్రి నుంచి వర్షం విరామం లేకుండా కురుస్తోంది. అయినప్పటికీ గొడుగు సాయంతో తన యాత్రను కొనసాగించారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి లంకలో ఉదయం 8 గంటలకు యాత్ర ప్రారంభించిన జగన్ రెండున్నర కిలోమీటర్లు నడిచి ఊలపల్లికి చేరుకున్నారు. మార్గమధ్యంలో రోడ్డుకు ఇరువైపులా బారులుదీరిన జనాలను పలకరించుకుంటూ ముందుకు సాగారు. తన కోసం వేచి చూస్తున్న విద్యార్థులు, మహిళలు, వృద్ధులను జగన్ ఆప్యాయంగా పలకరించారు. కొందరు తామెదుర్కొంటున్న సమస్యలపై జగన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. నేడు జగన్ సీబీఐ కోర్టులో హాజరైన అనంతరం తిరిగి శనివారం నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుంది.