Train: బెర్త్ అడిగిన యువతికి తన బెర్త్ ను చూపి దుర్మార్గానికి దిగిన టీటీఈ!
- అలహాబాద్ నుంచి జైపూర్ కు ప్రయాణిస్తున్న యువతి
- ఆర్ఏసీ కావడంతో బెర్త్ అడిగిన యువతి
- ఏసీ కోచ్ లో తన బెర్త్ చూపించి లైంగిక వేధింపులు
అలహాబాద్ నుంచి జైపూర్ కు ఆర్ఏసీ టికెట్ పై ప్రయాణిస్తున్న ఓ యువతి, అర్థరాత్రి వేళ తనకు బెర్త్ కావాలని అడిగితే, తన బెర్త్ తీసుకోమని చెప్పిన టీటీఈ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాన్పూర్ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, 18 ఏళ్ల యువతి తెల్లవారుజామున 2 గంటలకు తనిఖీలకు వచ్చిన టీటీఈ నానక్ సింగ్ ను తనకో బెర్తు కేటాయించాలని కోరింది. థర్డ్ ఏసీ కోచ్ బీ-3లో తనకు కేటాయించిన బెర్త్ లో పడుకోవాలని నానక్ సూచించాడు.
ఆపై తనిఖీలు పూర్తి అయిన తరువాత, ఆమె వద్దకు వచ్చి, మరెక్కడా బెర్త్ లు లేవని, దీన్నే షేర్ చేసుకుందామని చెప్పాడు. తన తాతయ్య వయసులో కనిపిస్తున్న నానక్ ను నమ్మిన ఆమె సరేనంది. ఆపై రైలు బోగీలోని లైట్లను ఆర్పేసి వచ్చిన ఆ దుర్మార్గుడు, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని అసభ్య ప్రవర్తనపై రైల్వే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఆమె ఫిర్యాదు చేయగా, రైలు కాన్పూర్ రాగానే పోలీసులు నానక్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అతన్ని సస్పెండ్ చేశామని, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు పెట్టామని విచారణకు ఆదేశించామని ఉన్నతాధికారులు తెలిపారు.