Amit Shah: చంద్రబాబు వెళ్లిపోతే మాకేం?... నితీశ్ వచ్చారుగా?: అమిత్ షా
- ఎన్ని ప్రాంతీయ పార్టీలు కలిసినా బీజేపీని ఓడించలేరు
- సర్జికల్ దాడులు చేపట్టిన రెండో దేశం ఇండియా
- నితీశ్ తో భేటీ అనంతరం బీజేపీ నేతలతో అమిత్ షా
కాంగ్రెస్ పార్టీతో ఎన్ని ప్రాంతీయ పార్టీలు కలిసినా బీజేపీని ఓడించలేవని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల పాటు మిత్రుడిగా ఉన్న చంద్రబాబు వైదొలగడంతో ఎన్డీయే బలహీనపడలేదని వ్యాఖ్యానించిన ఆయన, చంద్రబాబు తన కూటమి నుంచి వేరుపడితే, జేడీ (యు) నేత తిరిగి వచ్చారని ఆయన అన్నారు.
పట్నాలోని ప్రభుత్వ అతిథి గృహంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అయిన ఆయన, అల్పాహార విందు స్వీకరించారు. ఆపై బీజేపీ పదాధికారుల సమావేశంలో ప్రసంగించిన అమిత్ షా, ఇండియా అంతటా బీజేపీ పాలన వచ్చేలా చేసేందుకు క్షేత్ర స్థాయి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశ సైనికుల సత్తా చాటిన సర్జికల్ స్ట్రయిక్స్ పై కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేస్తోందని విమర్శించారు. ఈ తరహా దాడులను ఇజ్రాయిల్ తరువాత ఇండియా మాత్రమే చేపట్టిందని వ్యాఖ్యానించారు.