CBI: రమణ దీక్షితులుకు భంగపాటు... సీబీఐ విచారణ అవసరం లేదన్న న్యాయ శాఖ
- శ్రీవారి ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయని ఆరోపణలు
- సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన రమణ దీక్షితులు
- తిరస్కరించిన కేంద్ర న్యాయ శాఖ
తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక అపచారాలు జరుగుతున్నాయని, విలువైన ఆభరణాలు మాయం అవుతున్నాయని, పింక్ డైమండ్ ను వేలానికి ఉంచారని సంచలన ఆరోపణలు చేసి, తన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులుకు కేంద్ర న్యాయ శాఖ ముందు చుక్కెదురైంది.
రమణ దీక్షితులు సహా రిటైర్ అయిన మిరాశీ అర్చకులు న్యాయ శాఖను ఆశ్రయించి సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత ఇచ్చిన న్యాయ శాఖ, సీబీఐ విచారణ జరిపించలేమని పేర్కొంటూ, వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని వెల్లడించింది. కాగా, సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ పదవీ విరమణ చేసిన అర్చకులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు సమాచారం.