Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన జేసీ తనయుడు పవన్ రెడ్డి!
- ముందు రోజు వరకు టీడీపీతో ఉన్న పవన్.. సడన్ గా యూటర్న్ తీసుకున్నారు
- ఢిల్లీ నుంచి ఫోన్ రావడమే దీనికి కారణం
- టీడీపీ, వైసీపీల్లో టికెట్లు రానివారే జనసేనలో చేరుతారు
రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 10 ఓట్లు కూడా పడవని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి అన్నారు. కుంటుకుంటూ నడుస్తూ... కమ్యూనిస్టులను ఒక కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు కూడా లేరని అన్నారు. టీడీపీ, వైసీపీలో టికెట్లు రాని వారే జనసేనలో చేరుతారని అన్నారు. అనంతపురం జిల్లాకు చెందినవారే పవన్ చుట్టూ చేరి, ఆయనకు సలహాదారులుగా ఉన్నారని చెప్పారు.
పవన్ కల్యాణ్ తో తనకు కొంచెం పరిచయం ఉందని పవన్ రెడ్డి తెలిపారు. గుంటూరులో బహిరంగసభ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుందని చెప్పారు. లూజ్ కనెక్షన్ ఏర్పడిందో ఏమో కానీ... సడన్ గా యూటర్న్ తీసుకుని మంత్రి లోకేష్ ని టార్గెట్ చేశారని విమర్శించారు. తాను అప్పుడు టీవీని చూస్తూనే ఉన్నానని... లోకేష్ ను విమర్శించిన తర్వాత వైసీపీ గురించి ఏమైనా మాట్లాడతారేమోనని తాను భావించానని... అక్రమాలకు పాల్పడిన జగన్ ను విమర్శిస్తారేమోనని ఎదురు చూశానని... కానీ జగన్ గురించి ఉలుకూ పలుకూ లేకుండానే ప్రసంగాన్ని ముగించారని మండిపడ్డారు.
అంతకు ముందు రోజు వరకు టీడీపీతో సఖ్యతగా ఉండి, రాత్రికి రాత్రే పవన్ మారిపోయారని పవన్ రెడ్డి అన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు, ఢిల్లీ నుంచి పవన్ కు ఫోన్ వచ్చిందని చెప్పారు. 'మీరు టీడీపీతో ఉండకూడదు... మీకు ఎంత కావాలంటే అంత ముడుతుంది' అనేది ఫోన్ కాల్ సారాంశమని తెలిపారు. దీంతో, పవన్ కల్యాణ్ టీడీపీని టార్గెట్ చేశారని చెప్పారు.