Srikakulam District: ఈసారి శ్రీకాకుళం పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: ఏపీ సీఎస్
- సంక్షేమ పథకాలపై అవగాహన కలిగించేలా శకటాల ప్రదర్శన
- ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా నిర్వహణ
- ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు
ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై ఈరోజు విజయవాడలోని ఏపీ సీఎస్ దినేశ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఓ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీఎస్.. మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై మరింత అవగాహన కలిగించే రీతిలో ఆయా శాఖల శకటాల ప్రదర్శన (టాబ్లూస్)ను ఏర్పాటు చేయాలని, వేడుకలకు వచ్చే ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలని దినేశ్ కుమార్ ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నందున ఈ వేడుకలకు వచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, ఇతర మంత్రులు తదితర ప్రముఖలందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 12 ప్రభుత్వ శాఖలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తోన్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శకటాలను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను దినేశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశు సంవర్థక శాఖలకు సంబంధించిన శకటం, సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా సంక్షేమ ఆంధ్రప్రదేశ్ పేరిట శకటం ఏర్పాటు చేయాలని చెప్పారు.
అలాగే, సీఆర్డీఏ, విద్య, అటవీ, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్, సెర్ప్ (సాధికార మిత్ర), సాంఘిక, గిరిజన, మహిళా శిశు సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు నీటి వనరుల శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాలపై ఈ శకటాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.