paruchuri: ఆ పాత్రలకు ఆ కథానాయికలు వద్దని చెప్పాను: పరుచూరి గోపాలకృష్ణ
- 'ఎస్.పి. పరశురామ్'లో శ్రీదేవిని వద్దన్నాను
- 'చినరాయుడు'కి విజయశాంతి కరెక్ట్ కాదన్నాను
- 'చిట్టెమ్మ మొగుడు'లో దివ్యభారతిని వద్దన్నాను
రచయితగా పరుచూరి గోపాలకృష్ణ ఎన్నో విజయవంతమైన సినిమాలకి పనిచేశారు. ఆయన కథలకు .. మాటలకు ఎంతోమంది అభిమానులు వున్నారు. అలాంటి పరుచూరి గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
'ఎస్.పి పరశురామ్' సినిమాకి శ్రీదేవిని తీసుకుంటామంటే నేను వద్దని చెప్పాను. అప్పుడు 'జగదేకవీరుడు అతిలోక సుందరి' హిట్ ను గుర్తుచేశారు. అందుకే వద్దంటున్నానని చెప్పాను. ఆ సినిమాలో శ్రీదేవి అద్భుతమైన గ్లామర్ రోల్ పోషించింది. ఈ సినిమాలో ఆమెను అంధురాలిగా చూపిస్తే బాగుండదని చెప్పాను. ఒక బిడ్డకు ఆమె తల్లికావడం .. ఆ బిడ్డను పోగొట్టుకోవడం ఆడియన్స్ కి నచ్చకపోవచ్చని అన్నాను. కాదని చెప్పేసి శ్రీదేవిని తీసుకొచ్చారు. ఆవిడకి బదులు వేరే వాళ్లను పెట్టుకునుంటే బాగుండేది.
'చినరాయుడు'లో విజయశాంతిని వద్దని చెప్పాను .. ఎందుకంటే సెకండాఫ్ అంతా ఆ పాత్ర ఉండదు. 'చిట్టెమ్మ మొగుడు'లో దివ్యభారతిని వద్దన్నాను .. గర్భం వస్తే చనిపోతానేమోననే భయంతో భర్తతో కాపురం చేయని పాత్ర అది. అలాంటి పాత్రలో దివ్యభారతిని చూడటానికి ఇష్టపడరని చెప్పాను .. అదే జరిగింది. పాత్రకి తగిన ఆర్టిస్ట్ పడకపోతే ఆ సినిమా దెబ్బతింటుందనడానికి ఇవే నిదర్శనాలు" అని చెప్పుకొచ్చారు.