Adilabad District: జంతుశాస్త్రంలో ఆదిలాబాద్ గిరిజన విద్యార్థికి పీహెచ్డీ
- ఎలుకపై ప్రయోగ పత్రాలను సమర్పించిన విద్యార్థి నాగేశ్వర్
- ఎలుకకు ఫ్లోరోసిస్ వ్యాధిని సోకించి ప్రయోగం
- వన మూలికలతో చేసిన లేహ్యంను ప్రయోగించిన విద్యార్థి
- ఫ్లోరోసిస్ వ్యాధిని నయం చేసిన ఘనత
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గూడెంకు చెందిన విద్యార్థి మెస్రం నాగేశ్వర్ జంతుశాస్త్రంలో పీహెచ్డీ పొందాడు. ఆ జిల్లాలోని బేల మండలం, సోన్‌కాస్ గిరిజన ప్రాంతానికి చెందిన ఆయన... గూడెం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు తన విద్యా ప్రస్థానాన్ని సాగించాడు. జంతు శాస్త్రంలో న్యూరో బయోలజీ విషయంలో ఆ విద్యార్థి పీహెచ్డీ పత్రాలు సమర్పించాడు.
నాగేశ్వర్‌ని తెలంగాణ బీసీ సంక్షేమ, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో సన్మానించారు. జీవితంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రొఫెసర్ కే ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో మెస్రం నాగేశ్వర్ పీహెచ్డీ పూర్తి చేశాడు. ఎలుకపై ప్రయోగ పత్రాలను సమర్పించారు. ఎలుకకు ఫ్లోరోసిస్ వ్యాధిని సోకించి.. వన మూలికలతో తయారు చేసిన లేహ్యం కొర్సిటిన్ అనే మందుతో ఫ్లోరోసిస్ వ్యాధిని నయం చేసిన ఘనతను మెస్రం నాగేశ్వర్ సాధించాడు.
పదవ తరగతి నుంచి ఎంఎస్సీ వరకు నాగేశ్వర్ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే విద్యను కొనసాగించాడు. ఆయన తల్లిదండ్రులు జనార్దన్, శాంతా బాయిలు వ్యవసాయ కూలీలు. ఆయనను అభినందించిన వారిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడిపల్లి రవీందర్ రావు, జుట్టు అశోక్, విద్యార్థి జేఏసీ నాయకుడు రుయ్యాడి దత్తాద్రి, నాయకులు గెడాం ప్రవీణ్, గెడాం విలాస్, కలీం తదితరులు ఉన్నారు.