Chandrababu: విభజన హామీలు నెరవేరిస్తే ఇక ఇబ్బందులేముంటాయి?: సీఎం చంద్రబాబు

  • హామీలు అమలు చేయకపోవడం వల్లే బీజేపీకి టీడీపీ దూరమైంది
  • రాష్ట్ర  ప్రయోజనాల సాధనకు అంతా ఐక్యంగా ఉండాలి
  • విభజన సమస్యలు అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం

విభజన హామీలను అమలు చేయకపోవడం వల్లే బీజేపీకి టీడీపీ దూరమైందని, ఆ హామీలు నెరవేరిస్తే ఇక ఇబ్బందులేముంటాయని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖపట్టణం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విభజన హామీలన్నింటిని కేంద్రం నెరవేరుస్తామని చెబుతోంది కానీ, ఎంత సమయంలో వాటిని అమలు చేస్తారనేది ముఖ్యమని అన్నారు. ఈ హామీలను ఐదేళ్లలో కాకుండా పదేళ్లలో అమలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు అంతా ఐక్యంగా ఉండాలని, విభజన సమస్యలను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి రూపాయికీ కేంద్రానికి లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధమని అన్నారు. ‘పోలవరం’ ఖర్చు మొత్తాన్ని భరిస్తామన్న నితిన్ గడ్కరీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారు.

  • Loading...

More Telugu News