Amit shah: పొత్తుల్లేవ్.. తెలంగాణలో పోటీపై స్పష్టత ఇచ్చిన అమిత్ షా
- పొత్తులతోనే రెండు రాష్ట్రాల్లోనూ దెబ్బతిన్నాం
- ఒంటరిగానే ఎదుగుదాం
- తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ ఒంటరి పోరు
తెలంగాణలో ఎవరితోనూ పొత్తు ఉండబోదని, ఒంటరిగానే ముందుకు వెళ్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాలకు తెరపడింది. మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బలపడేందుకు మరింత దూకుడుగా ముందుకెళ్లాలని సూచించారు. శుక్రవారం నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సన్నాహక కమిటీ నేతలతో అమిత్షా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఓ ఎన్నికల ప్రణాళిక రూపొందించాలని నేతలకు సూచించారు. పొత్తుల కారణంగానే ఏపీ, తెలంగాణలో దెబ్బతిన్నామని, ఇకపై ఒంటరిగా వెళ్లి, సొంతంగా ఎదగాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, మంచి వారు పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని నేతలకు సూచించారు.