Nirmala seetharaman: అమెరికా ఆంక్షలు బేఖాతరు.. రష్యాతో ఆయుధ డీల్‌కే భారత్ మొగ్గు!
- అమెరికా ఆంక్షల చట్టాన్ని పట్టించుకోని భారత్
- చివరి దశలో ఎస్-400 డీల్
- అమెరికాను ఒప్పిస్తామన్న రక్షణ మంత్రి
అమెరికా ఆంక్షలను బేఖాతారు చేస్తూ రష్యాతో ఆయుధ డీల్ విషయంలో ముందుకే వెళ్లాలని భారత్ నిర్ణయించింది. డీల్‌లో భాగంగా ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ మిసైల్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ దాదాపు చివరి దశలో ఉందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షల చట్టం ఈ డీల్‌పై ప్రభావం చూపబోదని పేర్కొన్నారు.
తాము దశాబ్దాలుగా రష్యాతో స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నామని, రక్షణ అవసరాల కోసం ఆ దేశంపైనే ఆధారపడుతున్న విషయాన్ని అమెరికాకు అర్థమయ్యేలా చెబుతామని పేర్కొన్నారు. సీఏఏటీఎస్ఏ అనేది అమెరికా చట్టమని, అది ఐక్యరాజ్య సమితికి చెందినది కాదని స్పష్టం చేశారు. అమెరికాతో త్వరలో జరగనున్న 2 ప్లస్ 2 చర్చల్లో ‘కాట్సా’ గురించి కూడా చర్చిస్తామని మంత్రి తెలిపారు.
ఎస్-400 గురించి ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నట్టు చెప్పిన నిర్మల.. ప్రస్తుతం ఒప్పందం చివరి దశలో ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు రెండున్నర నుంచి నాలుగేళ్లు పడుతుందని వివరించారు. కాగా, రష్యాతో ఎస్-400 వ్యవస్థపై భారత్ చర్చలు ప్రారంభించినప్పటి నుంచి అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.