kumaraswamy: మోదీని ఒకలా, నన్ను మరోలా చూపిస్తారా?: మీడియాపై కుమారస్వామి ఫైర్
- పెట్రోల్ రేట్లను పెంచినప్పుడు మోదీని ఏమీ అనలేదు
- వంట గ్యాస్ ఇప్పటి వరకు రూ. 300 పెరిగినా ఏమీ అనలేదు
- రెండు నెలల మా ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తారా?
మీడియాపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీని ఒకలా చూపిస్తూ, తనను మరోలా చూపిస్తూ... ప్రజల ముందు తనను విలన్ లా నిలబెట్టారని మండిపడ్డారు. ఈరోజు బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ పై అధిక పన్ను ఎందుకు వేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దీంతో మీడియాపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పెట్రోల్ మీద మోదీ రూ. 20 పెంచినప్పుడు మీడియా ఎందుకు సైలెంట్ గా ఉందని ఆయన ప్రశ్నించారు. వంట గ్యాస్ సిలిండర్ మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 300 పెంచినా మీడియా మౌనంగా ఉందని... రెండు నెలలు కూడా నిండని కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తోందని మండిపడ్డారు. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని చెప్పారు.