Telangana: తెలంగాణలో 2.18 లక్షల మంది పాడి రైతులకు సబ్సిడీపై పాడి గేదెలు, పాడి ఆవుల పంపిణీ!
- మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటన
- వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభం
- విధి విధానాలను వెంటనే రూపొందించాలని ఆదేశాలు
- పలు రాష్ట్రాల నుంచి గేదెల కొనుగోలు
తెలంగాణలో 2.18 లక్షల మంది పాడి రైతులకు సబ్సిడీపై పాడి గేదెలు, పాడి ఆవుల పంపిణీని వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన విధి విధానాలను వెంటనే రూపొందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను తాము అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు.
ఈ కార్యక్రమం అమలుకు కావలసిన విధి విధానాలను వెంటనే రూపొందించాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలోని తన చాంబర్లో శ్రీనివాస యాదవ్ పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విజయ డెయిరీ ఎండీ నిర్మల, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ లతో కలసి విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి లతో పాడిగేదెల పంపిణీ కార్యక్రమం గురించి సమీక్ష జరిపారు.
అనంతరం మంత్రి శ్రీనివాస యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీ, మదర్ డెయిరీలకు పాలు పోస్తోన్న 2.18 లక్షల మంది రైతులకు సబ్సిడీపై పాడి గేదేలు, ఆవులను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు గాను 2, 3 రోజుల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు.
ఒక్కో పాడిగేదెకు 80 వేల రూపాయలు అవుతుండగా, ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ, బీసీలకు 50 శాతం సబ్సిడీని వర్తింపచేస్తామన్నారు. మొదటగా 15 వేల మంది లబ్దిదారులకు గేదెలను పంపిణీ చేస్తామని, ప్రతినెలా 15,000 నుండి 16,000 పశువులను కొనుగోలు చేయాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ గేదెలను హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి కొనుగోలు చేస్తామన్నారు.
ఇప్పటికే గేదెల కొనుగోలు చేయనున్న రాష్ట్రాలలో గేదెల లభ్యత, నాణ్యతను పరిశీలించేందుకు డెయిరీల ప్రతినిధులు, అధికారులు, రైతులతో కూడిన బృందాలు పర్యటించినట్లు ఆయన వివరించారు. లబ్దిదారులతో పాటు వైద్యులు, డెయిరీ ప్రతినిధులు, పశుసంవర్థకశాఖ అధికారులతో కూడిన బృందం వెళ్లి గేదెలను కొనుగోలు చేస్తారన్నారు.
పాడి గేదెల కొనుగోలు విషయంలో పూర్తిగా రైతుల ఇష్టాయిష్టాలపై ఆధారపడే విధంగా నిబంధనలు రూపొందించామన్నారు. పశు సంవర్థకశాఖ వైద్యులు నాణ్యత, ఇతర అంశాలపై మాత్రమే దృష్టిసారిస్తారని తెలిపారు. పశువుల కొనుగోలు విధి విధానాలను 2.18 లక్షల మంది సభ్యులకు తెలుగులో కరపత్రం రూపంలో ముద్రించి అందజేయాలని ఆదేశించినట్లు తెలిపారు.