child: పిల్లలను ఎత్తుకెళుతున్నారంటూ.. బీదర్‌లో హైదరాబాద్‌కు చెందిన కుటుంబంపై దాడి.. ఒకరి మృతి
- సామాజిక మాధ్యమాల్లో పుకార్లు
- దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు
- హైదరాబాద్‌లో బాధితులకు చికిత్స
వాట్సప్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న పుకార్లను నమ్మకూడదని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజల్లో మార్పు రావట్లేదు. పిల్లలను ఎత్తుకెళ్లే వారనే అనుమానంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అమాయకులపై దాడులు చేసి, హత్యలు చేస్తున్నారు. అటువంటి ఘటనే మరొకటి కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా ముర్కీ గ్రామంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంపై ఆ ప్రాంతవాసులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. ఈ దాడిలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాధితులను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పరామర్శించారు.
వారంతా తమకు బీదర్‌లో ఉన్న వ్యవసాయ భూములను చూసేందుకు వెళ్లి, మధ్యలో ఆగి స్నాక్స్ తింటుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్నాక్స్ తింటోన్న సమయంలో అక్కడ ఉన్న బడి పిల్లలకు తమ వద్ద ఉన్న చాక్లెట్లను ఆ కుటుంబం పంచడంతో, వారు చిన్నారులకు ఆశ చూపి అపహరిస్తున్నారని స్థానికులు అనుమానించి ఈ దాడికి పాల్పడ్డారు. మొత్తం 100 మంది ఈ దాడిలో పాల్గొనగా వారిలో 30 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ దాడిలో మృతి చెందిన వ్యక్తి పేరు మహ్మద్ ఆజాం అని తెలుస్తోంది.