TTD: తిరుమల చరిత్రలో తొలిసారి ఆరు రోజుల పాటు ఆలయం మూత... ఆలయంలో జరిగే క్రతువు ఏమిటంటే..!
- 12 సంవత్సరాలకోసారి మహా సంప్రోక్షణ
- ఆగస్టు 11 నుంచి 16 వరకూ స్వామి దర్శనం నిలిపివేత
- ఈ ఆరు రోజులూ స్వామి అంశ పూర్ణకుంభంలో
- సంప్రోక్షణ తరువాత తిరిగి మూలవిరాట్టులోకి
ప్రతి 12 సంవత్సరాలకూ ఒకసారి జరిగే మహా సంప్రోక్షణలో భాగంగా ఆగస్టు నెల 11 నుంచి 16 వరకూ తిరుమల శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమల చరిత్రలో ఇలా ఆరు రోజుల పాటు ఆలయాన్ని మూసివేయడం ఇదే మొదటిసారి. గతంలో మహా సంప్రోక్షణ జరిగినప్పుడు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుండేవారు.
అయితే, 12 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 40 నుంచి 50 వేల వరకూ ఉండేదని, ఇప్పుడు భక్తుల సంఖ్య 80 వేలు దాటుతుండటంతోనే పరిమిత సంఖ్యలో కూడా భక్తులను అనుమతించరాదని నిర్ణయించామని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ ఆరు రోజుల పాటు ఆలయంలో జరిగే స్వామివారి జీర్ణోద్ధరణ, పూర్ణకుంభంలోకి స్వామివారి శక్తిని పంపి, తిరిగి ఆ శక్తిని స్వామి విగ్రహంలోకి చేర్చడం అత్యంత కీలకమైన క్రతువు.
మహా సంప్రోక్షణం ఎందుకు?
స్వామివారి గర్భాలయంలో నిత్యమూ అనేక సేవలు, నైవేద్యాలు అందుతుంటాయి. ఆ సమయంలో ఆహార పదార్థాలు కొన్ని కిందపడుతూ ఉంటాయి. ఎంతో కొంత మాలిన్యం గర్భాలయంలోకి చేరుతుంది. దీనివల్ల ఆలయం లోపల పగుళ్లు వచ్చే అవకాశం ఉండటంతో, పుష్కరానికోసారి అర్చకులే మరమ్మతులు చేస్తారు. ఆ సమయంలో స్వామి అంశను ఓ పూర్ణకుంభంలోకి ఆవాహనం చేసి, దాన్ని పరకామణి ప్రాంతంలో ఏర్పాటు చేసే యాగశాలలో ప్రతిష్ఠిస్తారు. మహా సంప్రోక్షణ జరిగినన్ని రోజులూ యాగశాల బాలాలయంగా మారుతుంది.
ఈ ఆరు రోజుల పాటు స్వామికి జరిపే అన్ని కైంకర్యాలనూ బాలాలయంలోని పూర్ణకుంభానికి చేస్తారు. ఆ సమయంలో స్వామి శక్తి కలశంలో సుగుణమూర్తిగా, అగ్నిహోత్రంలో నిర్గుణమూర్తిగా ఉంటాయి. మూలవిరాట్టుకు ఎలాంటి అలంకరణలూ ఉండవు. ఇక గర్భాలయంలో సిమెంట్ ను వాడకుండా, ఆగమ శాస్త్రం ప్రకారం, రసాయనాలు, ఔషధాలతో తయారయ్యే 14 రకాల వజ్రలేపనాలు తయారు చేసి (ఇది ద్రవరూపంలో ఉండే సిమెంట్ వంటిది) దానితో మరమ్మతులు చేస్తారు.
ఆపై భక్తులు నడిచే ప్రాంతాల్లో శుద్ధి ప్రక్రియలు, పుణ్యాహవచనం తదితర ప్రాంతాలను కూడా శుద్ధి చేసి సుగంధ లేపనాలు రాస్తారు. గర్భాలయంలో మార్పులకు 18 మంది రుత్విక్కులు రానుండగా, నిత్య హోమం, శాంతి పూజల కోసం పలు రాష్ట్రాల నుంచి వందలాది మంది పండితులు తిరుమలకు రానున్నారు. మహా సంప్రోక్షణ ముగిసిన తరువాత స్వామివారి అంశను తిరిగి మూల విరాట్టులోకి ప్రవేశపెట్టడంతో ఈ క్రతువు పూర్తవుతుంది.