Hyderabad: బ్యాక్ డోర్ నియామకాలంటూ లక్షలు దోచుకుని బోర్డు తిప్పేసిన హైదరాబాద్ సంస్థ!
- మాదాపూర్ లో ఇపటైజెస్ ఇన్ఫోల్యాబ్
- ఆరు నెలల క్రితం ప్రారంభం
- యువతను నమ్మించి మోసం
- కేసు నమోదు
ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మి లక్షల రూపాయలు కట్టిన వారి ఆశలు వమ్మయ్యాయి. ఐటీ కంపెనీల్లో బ్యాక్ డోర్ నియామకాలు ఉన్నాయని, తమ వద్ద చేరితే ట్రైనింగ్ ఇస్తూ, నెలకు రూ. 13 వేలు ఇవ్వడంతో పాటు అవకాశాలను బట్టి పేరున్న కంపెనీల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పిన ఓ హైదరాబాద్ సంస్థ రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. మాదాపూర్ లోని జైహింద్ ఎన్ క్లేవ్ లో ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఇపటైజెస్ ఇన్ఫోల్యాబ్, తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యం చేసుకుని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు తీసుకుంది.
ఎంతో మందిని ఉద్యోగంలో చేర్చుకున్న సంస్థ యాజమాన్యం, వారికి శిక్షణ ఇస్తున్నట్టు నమ్మించి, ఎవరికీ తెలియకుండా బోర్డు తిప్పేసింది. రోజు మాదిరిగా శనివారం శిక్షణ నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారు, తాళం వేసుండటం చూసి, మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తామంతా కలసి రూ. 80 లక్షలు కట్టామని, వాటిని ఇప్పించాలని వేడుకున్నారు. ఈ కంపెనీపై కేసు పెట్టి విచారణ ప్రారంభించామని, నకిలీ కంపెనీలపై చట్టపరమైన చర్యలుంటాయని పోలీసు అధికారులు వెల్లడించారు.