Sujana Chowdary: అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ మద్దతు కోరాం: టీడీపీ ఎంపీ సుజనా చౌదరి
- ఏపీకి జరిగిన అన్యాయం, హామీల అమలుపై చర్చించాం
- పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెడతాం
- ఇందుకు మద్దతు కోరగా టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి పలు పార్టీల నేతలను కలిసి ఏపీ టీడీపీ ఎంపీలు వివరించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, జితేందర్ రెడ్డిని టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి ఈరోజు కలిశారు.
విభజన హామీల అమలుకు పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేస్తామని, తమకు మద్దతుగా నిలవాలని కేకేను కోరారు. అనంతరం, సుజనా చౌదరి మాట్లాడుతూ, ఏపీకి జరిగిన అన్యాయం, విభజన హామీల అమలుపై చర్చించామని చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని టీఆర్ఎస్ నేతలు అంగీకరించారని, త్వరలో జరగబోయే అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెడతామని, ఇందుకు టీఆర్ఎస్ మద్దతు కోరగా అందుకు సానుకూలంగా స్పందించిందని అన్నారు.