Whatsapp: బీదర్ దాడి ఘటన: ఒకసారి తప్పించుకున్నా.. వాట్సాప్ పోస్టుతో వెంటాడి చంపేశారు!
- దాడి నుంచి తప్పించుకున్న హైదరాబాదీలు
- వాట్సాప్లో ఫొటోలు షేర్ చేసిన స్థానికులు
- మరో చోట దారి కాచి దాడి
బీదర్లో హైదరాబాద్ వాసులపై జరిగిన దాడి వెనక ఉన్న విస్తుపోయే విషయం ఒకటి బయటపడింది. చిన్నారులకు చాక్లెట్లు ఇస్తుంటే కిడ్నాపర్లుగా భావించిన స్థానికులు వారిపై దాడిచేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. ఈ అమానుష ఘటన వెనక వాట్సాప్ పోస్టు ఉందన్న విషయం బయటకొచ్చింది. దీంతో వాట్సాప్ అడ్మిన్ సహా దాడికి పాల్పడిన 30 మంది స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గ్రామస్థుల దాడి నుంచి తప్పించుకున్న నలుగురు హైదరాబాదీలు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు. అయితే, స్థానికుల్లో కొందరు బాధితుల ఫొటోలను, వారి కారును ఫొటో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి కిడ్నాపర్లుగా పేర్కొన్నారు. వారు పలానా దారిలో వెళ్తున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో మరోచోట దారి కాచి కారును అడ్డుకున్నారు. వారిని బయటకు లాగి దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వాట్సాప్లో వదంతులను ప్రచారం చేసిన వాట్సాప్ అడ్మిన్ మనోజ్ కుమార్ ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.