New Orlans: జూ ఎన్ క్లోజర్ నుంచి తప్పించుకుని, వరుసగా జంతువులను చంపిన చిరుతపులి!
- న్యూ ఓర్లాన్స్ లో ఘటన
- 55 నిమిషాల్లో ఆరు జంతువులపై దాడి
- పరుగులు పెట్టి, బంధించిన జూ సిబ్బంది
ఎలా బయటకు వచ్చిందో ఏమోగానీ, తానుండాల్సిన ఎన్ క్లోజర్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన ఓ చిరుతపులి, ఆపై వరుసబెట్టి ఇతర జంతువులను చంపుతూ ఉండటంతో జూ అధికారులు పరుగులు పెట్టారు. ఈ ఘటన అమెరికాలోని న్యూ ఓర్లాన్స్ లోని అడుబోన్ జూలో జరుగగా, మూడేళ్ల వలేరియో అనే చిరుత పులి, జూ మొత్తం తనదే అన్నట్టు హల్ చల్ చేసింది. నాలుగు అల్పకాస్, ఒక ఈమూ, ఒక నక్కపై దాడి చేసి వాటిని చంపేసింది.
ఈ చిరుతపులి ఉదయం 7.20కి జూను ఓపెన్ చేయకముందే తప్పించుకున్నట్టు తెలిసిందని, ఆపై 55 నిమిషాల్లోపే, దాన్ని గుర్తించి, మత్తుమందిచ్చి, తిరిగి దాన్ని బంధించామని, మనుషులెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ చిరుత ఎలా తప్పించుకుందో విచారిస్తున్నామని చెప్పారు. కాగా, ఈ జూ చిన్నపిల్లలకు ఓ ఆటస్థలం వంటిది. నిత్యమూ వందలాది మంది ఇక్కడికి వచ్చి సేదదీరుతుంటారు.