Tirumala: తిరుమల వెంకన్నను భక్తులకు దూరం చేయడం మహాపచారం: రోజా
- టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
- స్వామి దర్శనం కుదరదనే హక్కు ఎవరికీ లేదు
- వెంటనే స్పందించకుంటే భక్తుల నుంచి వ్యతిరేకత
వచ్చే నెలలో మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి దర్శనాలను నిలిపివేయాలన్న టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. శ్రీవారిని దర్శించుకోవడం కుదరదని చెప్పే హక్కు టీటీడీకి లేదని వ్యాఖ్యానించిన ఆమె, వెంటనే స్పందించకుంటే భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతను చవి చూడక తప్పదని హెచ్చరించారు.
స్వామివారిని భక్తులకు దూరం చేయాలన్న ఆలోచన మహాపచారమని అన్నారు. గతంలో బాలాలయ మహా సంప్రోక్షణం జరిగిన సందర్భాల్లో కూడా భక్తులు స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారని గుర్తు చేసిన ఆమె, తాజా నిర్ణయంతో టీటీడీ అపఖ్యాతి పాలు అవుతోందని మండిపడ్డారు.