Rajasthan: భార్య అలిగెళ్లిందని డిటొనేటర్ తో తనను తాను పేల్చేసుకున్న భర్త!
- ఎంత వెతికినా కనిపించని భార్య హేమలత
- గనుల్లో నుంచి డిటొనేటర్ తెచ్చిన వినోద్
- పొట్టకు డిటొనేటర్ కట్టుకుని అంటించుకున్న వైనం
తనపై అలిగి వెళ్లిపోయిన భార్య ఎంత వెతికినా కనిపించలేదన్న మనస్తాపంతో డిటొనేటర్ తో తనను తాను పేల్చేసుకున్నాడో భర్త. ఈ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి గోవర్థన్ విలాస్ ప్రాంతానికి చెందిన వినోద్ మీనా (30), హేమలత భార్యాభర్తలు. వినోద్ గనుల్లో రాళ్లు కొట్టే పని చేస్తుంటాడు.
ఆరు రోజుల క్రితం భర్తతో గొడవపడిన హేమలత, ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక, తనకు తెలిసిన చోటెల్లా గాలించాడు వినోద్. ఫలితం లభించకపోవడంతో, మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తాను పనిచేసే ప్రాంతం నుంచి ఓ డిటొనేటర్ ను తీసుకువచ్చాడు. దాన్ని పొట్టకు కట్టుకుని, నిప్పంటించుకుని వీధుల్లోకి పరిగెత్తాడు. అది పేలడంతో వినోద్ శరీరం తునాతునకలైంది.
ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో నమోదయ్యాయి. వినోద్ తన పొట్టకు డిటొనేటర్ కట్టుకోవడం ఇందులో స్పష్టంగా కనిపించిందని చెప్పిన పోలీసులు, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.