Football: పుతిన్ ఒక్కడికే గొడుగు.. వర్షంలో తడిసిన ఫ్రాన్స్, క్రొయేషియా అధినేతలు!
- ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత ఓ ఆసక్తికర సంఘటన
- వర్షం పడుతూ ఉంటే పుతిన్ కు మాత్రమే గొడుగు
- తడుస్తూనే ఉన్న మెక్రాన్, కొలిండా
- చలోక్తులు విసురుతున్న నెటిజన్లు
గత రాత్రి ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కప్పును బహూకరించే ప్రెజంటేషన్ పార్టీ జరుగుతున్న వేళ, ఆ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, క్రోయేషియా అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్, ఫిఫా అధ్యక్షుడు గియాన్నీ ఇన్ఫాన్టినోలు హాజరయ్యారు.
ఆ సమయంలో భారీ వర్షం పడింది. పుతిన్ భద్రతా సిబ్బంది వెంటనే ఆయనకు గొడుగు పట్టి తడవకుండా చూసుకున్నారు. అయితే, మెక్రాన్, కొలిండాలు మాత్రం ఆ సమయంలో వర్షంలోనే తడుస్తూ ఉన్నారు. సిబ్బంది పుతిన్ కు మాత్రమే గొడుగు పట్టిన వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు చలోక్తులు విసురుతున్నారు.
ఆ తరువాత మరికొన్ని గొడుగులు తెప్పించినప్పటికీ, రష్యాలో ఒకే గొడుగు వుందా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తనదైన శైలిలో స్పందిస్తూ, "ట్రోఫీ ప్రెజెంటేషన్ కన్నా పుతిన్ గొడుగు సీన్ హైలైట్" అని ట్వీట్ చేశారు. ఇక ఈ సీన్ పై ఎన్నెన్నో కామెంట్లు వచ్చాయి.
మిగతా దేశాలు మన రష్యాను గెలవనివ్వలేదు కాబట్టి ఒకే గొడుగు చాలని పుతిన్ చెప్పాడంటూ జోకులు పేలుతున్నాయి. తన కోసం మాత్రమే ఆయన గొడుగు తెచ్చుకున్నారని, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటే ఇవేనని, గొడుగు పట్టే సిబ్బందిని కలిగుండటమే పుతిన్ పవర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు.