tollywood: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
- సుప్రీంలో పిటిషన్ వేసిన కేతిరెడ్డి
- నేడు విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం
- విధివిధానాలను రూపొందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు
డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను వణికించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న డ్రగ్స్ వినియోగంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు విధివిధానాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు నాలుగు నెలల సమయం కావాలని కేంద్రం కోరగా... ఇంతవరకు ఎందుకు రూపొందించలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 31లో విధివిధానాలను రూపొందించాలని ఆదేశించింది.
విధివిధానాలను రూపొందించడంలో ఎయిమ్స్ సహకారం ఆలస్యం అవుతోందని ఈ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. విధివిధానాలను రూపొందించిన తర్వాత... రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసే అంశం గురించి ఆలోచిద్దామని ధర్మాసనం తెలిపింది. తరుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.