Rahul Gandhi: మోదీ గారు, మీకు మద్దతిస్తాం.. ఆ బిల్లు ఆమోదం పొందేలా చూడండి: రాహుల్‌గాంధీ
- మహిళా సాధికారత బిల్లు ఆమోదం పొందాలి
- 2010లోనే రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది
- లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేలా ప్రధాని చూడాలి
మహిళా సాధికారత కోసం పోరాడుతానని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని... ఇప్పుడు పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని... పార్లమెంటు సమావేశాల్లో మహిళల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మహిళల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడంలో మోదీకి కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతిస్తుందని చెప్పారు.
ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా కూడా తెలిపామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ప్రధానిని కోరుతున్నానని చెప్పారు. 2010లోనే ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదముద్ర పడిందని.. కానీ లోక్ సభలో మాత్రం ఆమోదం లభించడం లేదని అన్నారు. 2010లో రాజ్యసభలో అప్పటి ప్రతిపక్ష నేత అయిన అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ఇదొక చారిత్రాత్మకమైన బిల్లు అని ప్రశంసించారని చెప్పారు. అయితే, ఈ బిల్లుపై ఇప్పుడు బీజేపీ మరో ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.